బాబు వలలో హరికృష్ణ

చంద్రబాబు మరో ప్లాన్ వేశారు. తెలుగుదేశం పార్టీకి దూరమవుతున్న ఎన్టీయార్ కుటుంబ సభ్యులను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే హరికృష్ణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా నియమించే దిశగా అడుగులేస్తున్నారు. తద్వారా ఎన్టీయార్ కుటుంబ సభ్యులందరినీ శాంతింప చేయవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. వాస్తవానికి చాలాకాలంగా ఎన్టీయార్ కుటుంబ సభ్యులంతా చంద్రబాబుకు దూరంగానే ఉంటున్నారు.

లోకేష్ కు బాలకృష్ణ కుమార్తెతో వివాహం జరిపించి వారిలో ఒకరిని దగ్గరకు చేసుకోగలిగారు. కానీ హరికృష్ణ, పురంధేశ్వరి లాంటి వారెవ్వరూ చంద్రబాబు చెంతకు చేరలేదు. పైగా వీరిద్దరూ వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో చేరతారన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. దాంతోపాటు హరికృష్ణ వియ్యంకుడు నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరి చిలకలూరిపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమూ నడుస్తోంది. అదే జరిగితే చంద్రబాబు పార్టీకి తీవ్ర నష్టం తప్పదు. దీంతో వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా హరికృష్ణను మచ్చిక చేసుకునేందుకు ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే దీనికి హరికృష్ణ నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. హరికృష్ణను టీటీడీకి ఛైర్మన్ ను చేస్తే ఆయన వైసీపీ వైపు చూడరని, ఆయన వియ్యంకుడు నార్నె శ్రీనివాసరావు కూడా ఆవైపు వెళ్లడనేది చంద్రబాబు ఆలోచన. మరి ఏంజరుగుతుందో చూడాలి.