మంత్రి భూమా అఖిలప్రియ వెనుక స్వంత పార్టీలోనే కుట్ర?

కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయాలలో తాజా పరిణామాలు యువ మంత్రిణి భూమా అఖిలప్రియ స్థానాన్ని ఒకింత గందరగోళంలోకి నెట్టేశాయి. మూడేళ్ల క్రితం తల్లిని కోల్పోయి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఈమె, తాజాగా తండ్రిని కోల్పోయి, తెలుగుదేశం అధికార రాజకీయాల వ్యూహంలో ఇటీవల మంత్రి పదవిని చేపట్టారు. ఇప్పుడు ఆమెకి మంత్రి పదవి ఉండొచ్చేమో కానీ పార్టీలో మద్దతు విషయమే ప్రశ్నార్ధకమవుతున్నది.

ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నిక సీటు విషయంలో జరిగిన పరిణామాల అనంతరం, బ్యాక్‌ గ్రౌండ్‌ ఎంత బలంగా పనిచేస్తుందో మంత్రి అఖిల ప్రియ చుట్టూ ముసురుకున్న పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది. తండ్రి అండ లేని ఆమె, ఇప్పుడు స్వంతంగా నెట్టుకు రావలసినదే తప్ప, పార్టీలో కూడా పెద్దల మద్దతు అరకొరగా, పొడిపొడిగా తప్ప లేదని అర్థమవుతున్నది. వెనకాల అండగా నిలబడే పెద్ద దిక్కు లేకపోవడంతో.. అఖిలప్రియపై ముప్పేట దాడి మొదలైనట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి దాకా కిక్కురుమనని గొంతులు కూడా ఇప్పుడామెపై ఒకింత నిరసన గళాలను వినిపించడం మొదలెట్టాయి. ఇది సహజ పరిణామమా? లేక పార్టీలో ఆమె వెనకాల కుట్రేమైనా జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తల్లిదండ్రుల సెంటిమెంట్‌ తప్ప, వారి వెలితితో కిందా మీదా అవుతున్న అఖిలప్రియ, మంత్రి పదవితో స్వతంత్రంగా జిల్లాలో పట్టును ఏర్పరుచుకుంటున్నారు. ఈ తరుణంలో నంద్యాల ఉపఎన్నిక టికెట్‌ విషయంలో శిల్పా మోహన్‌ రెడ్డితో మొదలైన పేచీ, ఆ తర్వాత పార్టీలో లుకలుకలకు తావిచ్చేలా మారింది. ఏకపక్ష పోకడలంటూ సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం, తనకు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఆఫర్‌ ఉందంటూ ఎవి సుబ్బారెడ్డి సైతం పరోక్ష బెదిరింపులకు దిగడం ఇప్పుడు అఖిలప్రియకు ప్రతికూలతలుగా పరిణమించాయి. 

అయితే ఇదంతా అఖిలప్రియ పట్టును దెబ్బతీయడానికి ఒక వర్గం నుంచి జరుగుతున్న కుట్ర అనే అనుమానాలు తెర పైకి వస్తున్నాయి. అఖిలప్రియ ఎదుగుదల కొంతమందికి కంటగింపుగా మారడం వల్లే ఇప్పుడామెకి ఈ పరిస్థితి తలెత్తిందనేది నంద్యాల రాజకీయాల్లో వినిపిస్తోన్న మాట. నంద్యాల సీటు విషయంలో వివాదానికి ఆస్కారమిచ్చిన టిడిపి అధిష్టానం, ఈ విషయంలో కూడా పార్టీలో ప్రత్యర్థులకు అవకాశమిచ్చేలా మిన్నకుండటం ఇప్పుడు ఆమె అనుయాయులకు మింగుడు పడటం లేదు. ఇదిలాగే కొనసాగితే టీడీపీలో ఆమె భవిష్యత్తు రాజకీయాలు మున్ముందు మరింత జటిలం కానున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి వరకు కుటుంబంలో ఒడిదొడుకులతో ఇబ్బంది పడ్డ అఖిలప్రియ, ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందనకుంటున్న తరుణంలో ఆమె పొలిటికల్‌ జర్నీలో కుదుపులు తప్పవనిపిస్తోంది. పార్టీలో ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో అఖిలప్రియ ప్రదర్శించే నేర్పు మీదనే ఆమె భవిష్యత్తు రాజకీయాలు ఆధారపడి ఉన్నాయంటున్నారు పరిశీలకులు.