ఆ మగవాళ్లని రోకలి బండతో కొట్టాలంట

ఫైర్ బ్రాండ్ గా పేరొందిన టీటీపీ మాజీ నేత నన్నపనేని రాజకుమారి ఇప్పటికీ అదే పంథాలో ముందుకు దూసుకుపోతున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై తన మాటలతో ఎంతగా దాడి చేసేవారో.. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా ఉన్న ఆమె మహిళలకు ఇచ్చే సూచనలు, సలహాలు తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఓరకంగా రాష్ట్రంలో కలకలం కూడా రేపుతున్నాయి.

ఇంతకీ ఆమె చెప్తున్నదేమిటంటే.. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు కత్తులు, కటార్లు వెంట తీసుకెళ్లాలంట. కారంపొడి ప్యాకెట్లను షరామామూలుగానే బ్యాగ్ లో పెట్టుకోవాలట. మహిళలపై రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టాలంటే తననుతాను రక్షించుకునేందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిందేనని ఆమె ఆడవాళ్లకు నూరిపోస్తున్నారు. ఆత్మ రక్షణ, మానరక్షణ కోసం రోకలిబండతో అవతలివాడి తలను పచ్చడి చేయాలని చెప్తున్నారామె. ఇలాంటి విషయాల్లో చట్టంలో కొంత వెసులుబాటు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ ఇలా పబ్లిక్ గా రోకలిబండలు, కత్తులు, కటార్లు చేతపట్టుకుని తిరగమనటం మాత్రం బాలేదని ప్రజాస్వామ్యవాదులు వాపోతున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో బీహార్ లాగా మారిందని, ఇక్కడ మహిళలపై అఘాయిత్యాలు మరీ దారుణంగా జరుగుతున్నాయని ఆమె అంగీకరించినట్లుగానే ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరి ఇంతజరుగుతుంటే నేరగాళ్లను అదుపు చేయటంలో ప్రభుత్వం ఎందుకు విఫలం అవుతుందో సీఎం చంద్రబాబే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.